Pages

Wednesday, January 2, 2013

ఎవరో ఆ చిత్రకారుడెవరో


బూంద్ జో బన్ గయీ మోతీ అనే పాత హిందీ సినిమాకుగాను సతీష్ భాటియా సంగీత దర్శకత్వంలో అమరగాయకుడు ముఖేష్ పాడిన ఒక మనోజ్ఞగీతానికి ఇది స్వేచ్ఛానువాదం. భరత్ వ్యాస్ అనే కవి కలం అక్షరాలను అద్దితే దానికి ముఖేష్ గొంతు దానికి వివిధ వర్ణాలను అద్దింది. ఎంతో ప్రసిద్ధమైన  ये कौन चित्रकार है అనే పాటకు ఇది స్వేచ్ఛానువాదం. స్వేచ్ఛానువాదం అనడానికి కారణం మూలసోయగాన్ని యథాతథంగా ఆవిష్కరించడం చేతగాని నా చేతగానితనమే అని వినయంగా ఒప్పుకుంటూ - 

ఎవరో ఆ చిత్రకారుడెవరో



ఎవరో ఆ చిత్రకారుడెవరో
పిల్లతెమ్మరలు ఆటలాడే వెండిమబ్బుల  నీలిగగనాన్ని ఆకుపచ్చని వసుంధరకు ఆచ్ఛాదనగా గీసిందెవరో
దిశదిశన ఆనందాల రంగులు నింపి
అంబరాన మెరుపులు రాసిందెవరో
సుమనోజ్ఞ సుమాలతో శృంగారం రచించిందెవరో
ఎవరో ఆ చిత్రకారుడెవరో

ప్రకృతి పావన సుగుణాలను సువర్ణమాలగా
అంబర లలాటాన  అరుణిమను అద్ది విరాడ్రూపాన్నిరచించిందెవరో

వేలవేల నోళ్లు వేనోళ్ల పొగిడే
లక్షల కళ్లు ఆబగా తాగే సోయగాన్ని
నా ఈ రెండు కళ్లముందు చిత్రించిందెవరో
ఎవరో ఆ చిత్రకారుడెవరో

మౌనముద్రనున్నమహాతపస్వుల వోలె
ఆత్మతృప్తి నిల్చిన అంబరచుంబి శిఖరాలు,
మంచుతెరలు కప్పుకున్న మనోహర లోయలు
ధ్వజాలవోలె నిల్చిన దేవదారు పాదపాలు
వసంతశోభల విలసిల్లే వనభూములు
ఏ మహోన్నత సృజనశీలి మనోజ్ఞ కల్పనలో
ఎవరో ఆ చిత్రకారుడెవరో

No comments:

Post a Comment