Pages

Monday, September 26, 2011

Translated Poetry అనువాద కవిత - త్రీ ఈడియట్స్


రచనాకార్ బ్లాగులో ఈ హిందీ కవిత కనబడింది. దాన్ని నేను తెలుగులోకి అనువదించాను. చదివి మీ అభిప్రాయాలను తెలపండి
త్రీ  ఈడియట్స్
మూల కవిత (హిందీ)                                       అనువాదం
గోపీ గోస్వామి                              డా.. కే. పూర్ణప్రజ్ఞాభారతి

నగరం నడిరోడ్డుపైన
మిట్టమధ్యాహ్నం వేళ
ఓ హత్య అలవోకగా జరిగిపోయింది
నగరం నిరంతర స్రవంతిలా,
ప్రతిరోజులా సాగిపోతూనే ఉంది
ఆగలేదు, కన్నీటి బొట్టు కార్చలేదు
కళ్లు మూసుకుని అలా నడుస్తునే సాగింది
కూసింత స్పందనలేని జీవరహిత జీవనంలో
చనిపోయింది మానవత్వమని కూడా గమనించలేదు
కళ్లే తెరిచి ఉండుంటే కనబడేది కదా శవం
ఐనా నగరానికేమిటి బాధ
శవాలను దాటుకుంటూ నడవడం
దానికి అలవాటే కదా


ఎలాగోలా వార్త వీధికెక్కింది
న్యూస్ ఛానెళ్లలో నవీనోత్తేజం తలెత్తింది
మరణించిన మానవత్వం
నగరం నిద్ర పోతోందా
ఎవరు, ఎందుకు, ఎక్కడ చేశారు
పతాక శీర్షికలు చడామడా వెలిశాయి
వార్తా ఛానెళ్లలో వాదవివాదాలు వెల్లివిరిశాయి
బ్రేకింగ్ న్యూసుల మీద డబ్బు బిస్కెట్లు తింటూ
టీఆర్పీల మీద టెంటులు వేసుకునే ఛానెళ్లు
మానవత్వపు శవానికి పోస్టుమార్టం చేయసాగాయి
మానవత్వం మాత్రం శవంగానే మిగిలింది
ముందు వస్త్రాపహరణం, తర్వాతే హత్య
కృష్ణుడు రాలేదు, దాన్ని కాపాడలేదు
హంతకుడు మాత్రం నగరంలో నిర్భీతిగా,
మనలో ఒకడుగా కలగలిసిపోయాడు,
కానరాకుండా జనజీవన స్రవంతిలో లీనమైనాడు

మన మార్కెట్లలో అన్నిటికీ ముసుగులున్నాయి
అవినీతి, అక్రమాలు, లాభాలు, లోభాలు
ప్రేమోన్మాదం, కామోన్మాదం, మతోన్మాదం
అందరికీ ఇక్కడ మర్యాదస్తుల ముసుగులున్నాయి
నగరం స్వార్థపు శరీరానికి మంచి ముసుగు తొడుక్కుని
తెల్లవారగానే తన రోకటిపాట జీవితాన్ని మళ్లీ ఆరంభిస్తుంది

మర్నాడే మరో వీథిలో మరో శవం కనిపిస్తుంది
మళ్లీ మానవత్వమే మరణిస్తుంది
నగరం తమ గానుగ గాడిలో
మళ్లీ మళ్లీ ఘనంగా నడుస్తునే ఉంటుంది
రామేశ్వరంలో సముద్రంలా
నగరం నిశ్శబ్దంగా తన దారిలో నడుస్తునే ఉంటుంది
మూడు కోతుల గాంధీ సూత్రం మాత్రం
ఉత్సాహం లేక నీరసంగా నిలిచి చూస్తుంటుంది
వినాల్సి వస్తుందని ప్రభుత
తన చెవులు మూసుకుని కూర్చుంటుంది
కళ్ల గంతలు కట్టుకున్న న్యాయం
న్యాయాన్ని ఎలా చూస్తుంది,
కన్నులు మూసుకుంటే లోకం చీకటౌతుందా ఏమిటి
మరి మనమో
అదేమిటి మూతిపై చేతులు
అరే నాకర్థమైపోతోంది.
అర్థమైంది
శాశ్పత వాస్తవం నాకు అర్థమైపోయింది...

No comments:

Post a Comment