Pages

Friday, October 28, 2011

నా పాత్రలు - అనువాద కవిత


1937లో జన్మించిన చంద్రశేఖర కంబార కన్నడ సాహిత్యసీమలో ఒక విశిష్టస్థానం ఆక్రమించిన సాహితీమేరువు. జ్ఞానపీఠ పురస్కారాన్ని, సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ సత్కారం పొందిన కంబార కవి, నాటకకర్త, జానపద విజ్ఞానవేత్త, చిత్ర దర్శకుడే కాక హంపీలో స్థాపించిన కన్నడ విశ్వవిద్యాలయపు తొలి ఉపకులపతి కూడా. ఉత్తర కన్నడ మాండలిక ప్రయోగానికి పెట్టింది పేరైన కంబార రచించిన ఒక కవితకు నేను చేసిన అనువాదం ఇక్కడ ఇస్తున్నాను.

నా పాత్రలు
నాటకంలో నేను సృష్టించిన పాత్ర ఒకటి
రంగస్థలం దిగి నేరుగా క్రిందికి వచ్చేసింది
కుర్చీ ఒకటి లాక్కుని
నా పక్కనే కూర్చుంది.
నేను నాటకాన్ని చూస్తుంటే
ఆ పాత్ర నన్నే తేరిపారా చూస్తోంది
అతని చూపులు తూపుల్లా
నా హృదయానికి తీవ్రంగా తాకాయి
నా కాళ్లు తనకు తాకకూడదని
దూరంగా నేను జరుపుతూనే ఉన్నా
అతనివి నన్ను తాకుతూనే ఉన్నాయి
అతని చెయ్యి భారంగా నా భుజంపై పడ్డది
ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా ఉంటే
అతని నవ్వు అక్కడ ప్రతిధ్వనించింది
అనవసరమైన చోటే అతని చేతులు చప్పట్లు కొట్టాయి
అందరి చూపులు అతనిపై ఉంటే
అతనివి మాత్రం నాకే అతుక్కుపోయాయి
ఇబ్బందిగా తోచి నేను లేచి బయటికి వస్తే
అతనూ నన్ను అనుసరించాడు
నేను తలుపులు తెరవగానే
అమర్యాదగా నాకన్నా ముందే అడుగు బయటికేశాడు
నాకు చిరపరిచితమైన నవ్వుతో
అద్దంలా నా ముందు నిలిచాడు
నేను నేర్పిన సంస్కారాన్ని అద్దుకున్న నా పాత్రలు
నా నుంచి సభ్యత నేర్చుకున్న నా పాత్రలు
ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయో
నాకేమాత్రం తెలియడం లేదు

(ఓ.ఎల్. నాగభూషణ స్వామి ఆంగ్లానువాద సహాయంతో)

No comments:

Post a Comment