Pages

Sunday, January 8, 2012

మరో అడుగు నడక

అనే సైట్లో అనూప్ భార్గవ అనే కవి రాసిన అగలే ఖంబే తక్ అనే కవిత చదివాను. ముందు దాన్ని యథాతథంగా అనువాదం చేద్దామనుకున్నా. కాదు... దాని ఆధారంగా స్వంతది రాద్దామనుకున్నా. కాస్తంత వియోగాన్ని కలిపా... అప్పుడు ఆ వంటకం ఇలాగ వచ్చింది.

మరో అడుగు నడక
ఆ కొండదారుల్లో
మట్టినిండిన మార్గాల్లో
నువ్వూ నేను వేసిన అడుగులు
నాకింకా గుర్తున్నాయి.
చేతులు పట్టుకుని
మైళ్ల దూరం కొలిచాం
మార్గమధ్యంలో నేను అలిసిపోతే
ఇంకొక్క అడుగే, ఆ స్తంభందాకే
అనే నీ మాటలూ గుర్తున్నాయి.



ఒంటరిగా నేనిప్పుడు అక్కడే నడుస్తున్నా
ఈ దారిలోని స్తంభాలు
నన్ను అదోలా చూస్తున్నాయి.
నీ గురించే ఆరా తీస్తున్నాయి.
నేను అలిసిపోతున్నా
ఐనా నా నడక ఆపను.. వెనక్కి చూడను
ఆ చివరి స్తంభం కూడా దాటాలిగా
తొందరపడడం నీ లక్షణం కదా
అందుకే నా కన్నా ముందే పరుగులు తీశావు
చివరిస్తంభాన్ని ముందుగానే దాటేశావు
బహుశా నాకోసమే నిరీక్షిస్తున్నావేమో
ఎదురు చూస్తున్నావేమో
నా నడక ఆపను..
నేనూ చివరిస్తంభాన్ని దాటాలిగా

No comments:

Post a Comment